ఫ్లాష్.. ఫ్లాష్...
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి
అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలి
ప్రజలెవరూ ఇండ్లనుండి బయటికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి
ప్రజల సౌకర్యార్థం ఫిర్యాదులు, సమస్యలు తెలపడానికి 24*7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు
జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్
చెరువులు, రోడ్లు, కల్వర్టుల పరిస్థితిని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలని ఆదేశం
ఆదివారం, 26 సెప్టెంబర్, 2021
జిల్లాలో ఈరోజు (ఆదివారం) రాత్రి నుండి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలెవరూ ఇండ్ల నుండి బయటికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదివారం సాయంత్రం జిల్లా ప్రభుత్వ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు (ఆదివారం) రాత్రి నుండి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలెవరూ ఇండ్ల నుండి బయటికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, చెరువులు నిండి ఉన్న దృష్ట్యా అధికారులు కనిపెట్టుకుంటూ ఉంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నీటి పారుదల శాఖ, రోడ్లు, భవనాలు శాఖ, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ, అలాగే మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండి కల్వర్టులు, రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలని చెరువులు, జలాశయాల నీటి మట్టాలను పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంది సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.
అవసరమైతే ఈరోజు రాత్రి నుండి ప్రమాదకరమైన రోడ్లు ఉన్న చోట రవాణా జరగకుండా బారికేడింగ్ చేయాలని సూచించారు.
ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.
సిరిసిల్ల పట్టణంలో వరద ప్రభావిత ప్రాంతాలైన శాంతి నగర్, వెంకంపేట, ఇతర లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా పలువురు జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు.
అధికారుల సూచనలను ప్రజలు పాటించాలని, అనవసరంగా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా అధికారులు శిథిలమైన ఇండ్లు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఆస్తి, పంట నష్టాల వివరాలను జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. వివరాలను తెలియజేయడానికి కంట్రోల్ రూమ్ నంబర్ 9398684240 ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీ బి. సత్య ప్రసాద్, ఇంఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ శ్రీనివాస రావు, నీటి పారుదల శాఖ అధికారి శ్రీ అమరేందర్ రెడ్డి, డీపీఓ శ్రీ రవీందర్, డీఆర్డీఓ శ్రీ కౌటిల్య, పంచాయితీ రాజ్ ఈఈ శ్రీ శ్రీనివాస్, ఆర్ & బి ఈఈ శ్రీ కిషన్ రావు, మిడ్ మానేర్ ఈఈ శ్రీ జగన్, ప్యాకేజీ - 9 ఈఈ శ్రీ శ్రీనివాస్, సిరిసిల్ల, వేములవాడ ల మున్సిపల్ కమీషనర్లు శ్రీ సమ్మయ్య, శ్రీ శ్యామ్ సుందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment
0 Comments